शनिवार, 13 दिसंबर 2014

కీలుగుఱ్ఱం

అనగనగా ధర్మపురి పట్టణాన్ని ధర్మంగూడను రాజు పరిపాలించేవాడు. ఒక రోజు రాజు తన మంత్రితోపాటు వేటకి బైలుదేరాడు. ఆ రోజు నిరాశే చవిచూశాడు. అలిసిపోయిన రాజు సేద తీర్చుకోవడం కోసరం ఓ నది ఒడ్డుకు చేరాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయిని చూసి మనసు పడ్డాడు. ఆ అమ్మాయి తండ్రి దెగ్గరికి తన రాజభటులను పంపించాడు. ఆగ్రహించిన ఆమె తండ్రి రాజభటులతో ఇలా అన్నాడు – ‘పెళ్లి ఎవరికి? మీకా మీ రాజుకా? స్వయంగా వచ్చి అడగలేని వాడికి పెళ్ళెందుకు?’ ఇది విన్న రాజుకు కోపం వచ్చింది. కాని మంత్రి రాజుకు నచ్చచెప్పడంతో రాజు స్వయంగా వెళ్లి ఆ పిల్ల తండ్రిని అడగటంతో వారి వివాహం జరిగింది. కొత్త రాణితో పాటు రాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కొత్త రాణిని చూసి మిగతా ముగ్గురు రాణులు ఈర్ష్యాసూయలతో మండిపడ్డారు. 

కొన్ని నెలలకు చిన్న రాణి గర్భం ధరించింది. పొరుగూరు వెళ్తూ రాజు ముగ్గురు రాణులను పిలిచి చిన్న రాణిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. రాణికి కొడుకు పుడితే రాజుతో పాటు రాజ్య్యంకూడా చేయి జారిపోతుందని భయపడి పుట్టిన పసికందును చంపేయమని భటులకు ఆజ్ఞాపించారు. భటులు రాకుమారుడుని చంపలేక అడవిలో వదిలేసి రాజ్యానికి తిరిగి వచ్చేసారు. పోరుగూరునుంచి తిరిగి వచ్చిన రాజుకు చిన్న రాణికి ముసలం పుట్టిందని చెప్పారు. 

కాలం గడిచిపోతుంది. ఒక రోజు రాజభవనంలోకి చొరబడ్డాడని ఓ చిన్న పిల్లవాడిని భటులు బందించి రాజుగారిముండు హాజరుపరిచారు. ప్రశ్నించగా ఆ పిల్లవాడు రాజుతో ఇలా అన్నాడు – ‘నా గుర్రానికి దాహం వేస్తె నీళ్ళకోసం వెతుకుతూ ఇక్కడకి వచ్చాను.’ ఇది విన్న రాజు ఆ పిల్లవాడిని ఆశ్చర్యంగా చూసి ‘కీలుగుఱ్ఱం నిళ్ళు త్రాగుతుందా!’ అని అడిగాడు. దానితో ఆ పిల్లవాడు అన్నాడు – ‘ఈ రాజ్యంలో ఏమైన జరగవచ్చు. రాణికి ముసలం పుట్టగాలేనిది నా కీలుగుఱ్ఱం నీళ్ళు ఎందుకు త్రాగలేదు!’ అని అన్నాడు. ఇది విన్న రాజు ఆరా తీయగా నిజం తెలిసింది. తన కుమారుడుని అక్కున చేర్చుకొని రాజ్యాభిషేకం చేసాడు.